గ్రామ సభల్లోనే కరువు ప్రణాళికలు..క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలి: మంత్రి పొంగులేటి 

గ్రామ సభల్లోనే కరువు ప్రణాళికలు..క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలి: మంత్రి పొంగులేటి 
  • 3 మండలాల్లో శాశ్వత కరువు నివారణకు రూ.150 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కరువు నివారణ ప్రణాళికలు గదుల్లో కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా రూపొందాలని, ఇందుకోసం ఎంపిక చేసిన మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించాలని మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌‌ రెడ్డి ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను నమోదు చేసి కార్యాచరణను ఖరారు చేయాలని, పనుల అమలు కోసం గ్రామ, మండల స్థాయిల్లో ఉమ్మడి భాగస్వామ్య కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

కరువు ప్రభావం కేవలం పంట సాగుకే పరిమితం కాకుండా గ్రామీణ ఉపాధి, కుటుంబ ఆదాయాలపై కూడా పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో రైతులతో పాటు మహిళలు, యువత, సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాల అవసరాలను తప్పనిసరిగా చేర్చాలని స్పష్టం చేశారు. వర్షాభావ సమయాల్లో గ్రామీణ వలసలను నివారించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి వనరులు, ఆదాయ మార్గాలను పెంపొందించేలా సమగ్ర కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్‌‌లో విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపితో కలిసి మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ప్రజలు, రైతాంగం తట్టుకుని నిలబడేలా మూడు వెనుకబడిన మండలాల్లో రూ.150 కోట్ల వ్యయంతో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్‌‌డీఎంఎఫ్) సహకారంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా కరువు బారిన పడుతున్న ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలు, సామాజిక -ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మహబూబ్‌‌నగర్ జిల్లా మిడ్జిల్, నాగర్‌‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల, నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలాలను పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు విపత్తు నిర్వహణ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో కరువు-నిరోధక వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెడుతుందని మంత్రి వివరించారు. 

జర్నలిస్టుల సొంతింటి కల సాకారం చేస్తం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల చిరకాల ఆకాంక్షను ప్రజా ప్రభుత్వం త్వరలోనే నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు, చట్టపరమైన చిక్కులు లేని విధంగా, కుటుంబాలతో గౌరవప్రదంగా నివసించేందుకు అనువైన ప్రాంతంలో స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందిస్తోందని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నివాసయోగ్యమైన, సురక్షితమైన స్థలాలను అప్పగించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని వివరించారు.

గతంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా, ప్రతి జర్నలిస్టు కుటుంబం తలెత్తుకుని జీవించేలా అన్ని వసతులతో కూడిన ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నామని, ఈ విషయంలో పాత్రికేయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కాయని, ఇప్పుడు మళ్లీ ప్రజా పాలనలోనే వారి సొంతింటి కల నెరవేరుతుందని తేల్చిచెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో అతిత్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి వివరించారు.